ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల నిబంధన ఎత్తివేత

  • ప్రైవేట్ కాలేజీల్లో కొత్త కోర్సులకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు
  • కొత్తగా కాలేజీ పెడితే మాత్రం కార్పస్ ఫండ్ తప్పనిసరి
  • కోర్సుల అనుమతికి ప్రాంతాల వారీగా కొత్త ఫీజుల విధానం
  • ప్రతి కాలేజీకి వెబ్‌సైట్, పక్కా సమాచారం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
  • నకిలీ పత్రాలు సమర్పిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు
ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలలో కొత్త కోర్సులను ప్రారంభించేందుకు చెల్లించాల్సిన రూ.15 లక్షల కార్పస్ ఫండ్ నిబంధనను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఇకపై అదనపు కోర్సులు ప్రవేశపెట్టాలనుకునే యాజమాన్యాలకు ఆర్థిక భారం తగ్గనుంది.

అయితే, ఈ వెసులుబాటు కేవలం ఇప్పటికే ఉన్న కాలేజీలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ఒక ప్రైవేట్ కాలేజీని స్థాపించాలనుకుంటే మాత్రం, నిబంధనల ప్రకారం రూ.15 లక్షల కార్పస్ ఫండ్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కార్పస్ ఫండ్ రద్దు చేసినప్పటికీ, కొత్త కోర్సుల అనుమతి కోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక ఫీజుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, గిరిజన ప్రాంతాల్లో బీఏ కోర్సు అనుమతికి రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.40 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేలు చెల్లించాలి. బీఎస్సీ, బీకాం వంటి ఇతర కోర్సులకు వేర్వేరు ఫీజులు వర్తిస్తాయి.

కొత్త మార్గదర్శకాలు.. కఠిన నిబంధనలు
ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ప్రైవేట్ కాలేజీలను అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే, తప్పనిసరిగా 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉండాలి. ప్రతి ఏటా అనుమతిని రెన్యువల్ చేసుకోవాలి. 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం లీజు ఉంటే దానిని సొంత భవనంగానే పరిగణిస్తారు.

పారదర్శకతను పెంచేందుకు ప్రతి కాలేజీ తప్పనిసరిగా తమ వెబ్‌సైట్‌ను నిర్వహించాలని, ప్రతి ఏటా సెప్టెంబర్ 30లోగా పూర్తి సమాచారంతో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. గత మూడేళ్లలో మంజూరైన సీట్లు, ప్రవేశాలు, ఉత్తీర్ణత శాతం, అధ్యాపకుల అర్హతలు వంటి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. కాలేజీల తనిఖీలకు డేటా అనలిటిక్స్, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఎవరైనా నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా రూ.లక్ష జరిమానాతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. వరుసగా ఆరేళ్లపాటు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని కాలేజీల అనుమతులు పునరుద్ధరించబడవని స్పష్టం చేసింది.

AP Government
Private Degree Colleges
Corpus Fund Waiver
Higher Education Department
New Course Fees
Andhra Pradesh Education Rules

More Telugu News